“అమ్మ శ్రావ్య… తొందరగా కిందకి వెళ్లి క్యాబ్ అతని తో వస్తున్నానని చెప్పమ్మా”
హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని, మూడేళ్ల శరత్ ని చంకనేసుకుని కిందకి దిగింది ధరణి.
. అప్పటికే క్యాబ్లోకి ఎక్కి కూర్చుంది శ్రావ్య.
. కొడుకుని మధ్యలో కుదేసి తను కూర్చుని ‘ఉష్ ‘ అని నిట్టూర్చింది..
“పిన్ నెంబర్ చెప్పండమ్మా ” విసుగ్గా అడిగిన డ్రైవర్ మాటకి ఉలిక్కిపడి నెంబర్ చెప్పింది.
బ్యాగ్ లోంచి చిన్న డబ్బాలోని ఉప్మా స్పూన్ తో తీసి కొడుకుకి పెడుతూ, మనసులోనే చాలీసా చదవడం ప్రారంభించ బోయింది..
ప్రయాణాలలో కనీసం మూడుసార్లు సాయి చాలీసా చదవడం అలవాటు ధరణికి.
ఇంతలో క్యాబ్ డ్రైవర్ ఏవో పాటలు పెట్టాడు. అబ్బా ‘ఈ డిస్టబెన్స్ ఎలా ‘ అనుకుంది.
ఆపేయమందామంటే….
అసలే ఇందాకల క్యాబ్ డ్రైవర్ చిటపటలాడేడు ఆలస్యమైందని.
‘పోనీలే ఆ పాటలు ఉన్నా నా మానాన నేను చదువుకుంటాను ‘ అనుకుంది.
ఆ పాట అంత స్పష్టంగా లేకపోయినా మధ్య మధ్యలో ‘గోవిందా వెంకటరమణా’ అని పదాలు వినిపిస్తున్నాయి.
‘అయ్యో అది దేవుడి పాటే కదా! ఆ పాటని నిర్లక్ష్యం చేసి తను వేరే చదువుకోవచ్చా?
మళ్ళీ డైలమా
కానీ… తను చదవాల్సిన చాలీసా????
మొన్నా మధ్య ఒకసారి ఫ్రెండ్ తో కలిసి వెళుతూ చాలీసా చదవటం మాటల్లో పడి మర్చిపోయింది.
ఆరోజు కారు దిగి ఇంట్లోకి వెళుతుంటే ఎంత పెద్ద ఎదురు దెబ్బ తగిలింది తనకి. బొటనవేలు గోరు తెగి ఎంత రక్తం వచ్చిందో….
దేవుడా ఏం చేయాలి….
‘పోనీ ఈ ఒక్క పాట అయిపోంగానే గబుక్కున అడిగేస్తాను పాటలు ఆపేయమని’.
అనుకునే లోపల మరొక పాట ‘అయ్యప్ప దేవాయ నమః’ అంటూ వచ్చేసింది.
ధరణి ఇలా ఆలోచనలో కొట్టుమిట్టాడుతుండగానే
కొడుకు శరత్ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు.
” చూసావా… ఏమైందో ఏమిటో” అని గాబరా పడుతూ
కొడుకు వైపు చూసింది.
ఆలోచనల్లో అన్యవనస్కంగా ఉప్మా తినిపించిందేమో,పచ్చిమిరపకాయ
ఒకటి వాడి పంటికింద పడింది.
కారం భరించలేక నాలుక మీద వేలు పెట్టుకుని ఏడుస్తున్నాడు వాడు.
“అయ్యో చిట్టి తండ్రి ఉండు నాన్న” అంటూ గబుక్కున బ్యాగులో చెయ్యి పెట్టి చాక్లెట్లు తీసింది.
ఫైవ్ స్టార్ క్యాడ్బరీస్,, మిల్కీ చాక్లెట్ రెండూ చేతిలోకి
వచ్చాయి.
ఏది పెట్టను ఏది ఎక్కువగా తియ్యగా ఉంటుంది అనుకుంటూ “ఏది కావాలి నాన్న నీకు” అని అడిగింది కొడుకుని.
” అబ్బా! అమ్మా ముందు ఏదో ఒకటి తొందరగా పెట్టు.వాడికి మంట తగ్గుతుంది.”
అసలు పైకి వేరుగా కనిపించినా రెండు తీయగానే ఉంటాయి…. మంట తగ్గిస్తాయి.
పాడమూడేళ్ల శ్రావ్య తమ్ముడి బాధ చూడలేక తల్లిని తొందరపెట్టింది.
నోటికి తీపి తగలడంతోనే ఏడుపు ఆపేసి, చాక్లెట్ ని ఆస్వాదించడంలో మునిగిపోయాడు శరత్.
కర్చీఫ్ తో కొడుకు మొహం తుడుస్తూ ఉన్న ధరణికి శ్రావ్య మాటలలో విశిష్టార్థం గోచరించింది. శ్రావ్య ని దగ్గరకు లాగి గట్టిగా హత్తుకుంది..
వెనక్కి సీటు మీద చేరబడి, క్యాసెట్లో వస్తున్న దేవుళ్ల పాటలు వింటూ నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.
*******. ********. ****-*-