*సమాంతరం.*( గల్పికల పోటీకి )

ఆఫీస్ కి టైం అయిపోతుంది అని హడావిడిగా తయారవుతున్న సరోజ “అయ్యో అమ్మాయి సరోజా “అన్న అత్తగారి గొంతు విని హడావిడిగా బెడ్ రూమ్ లో నుంచి బయటికి వచ్చింది.

 ఒక్కసారిగా ఘాటైన మాడు వాసన. ” అయ్యో నా మతిమండ స్నానానికి వెళ్ళే ముందు పాలు స్టవ్ మీద పెట్టాను. చిన్న మంట మీదే పెట్టినట్టున్నానే…”

 అనుకుంటూ వంటింటి వైపు నడిచింది.

 స్టవ్ మీద పాల గిన్నె. ఇంచుమించు  పాలన్నీ ఇ గిరిపోయి మధ్యలో మాడు పెచ్చు కడుతోంది.

 “ఏమిటమ్మా సరోజా ఇది శుక్రవారం పూట పాలన్నీ మాడబెట్టేసావ్ “

” లేదు అత్తయ్య మీకు సాయంత్త్రానికి కాచి పెడదామని…..చిన్నమంట మీదే పెట్టాను” అనుకున్నా..

హడావిడిలో పెద్ద మంట మీద పెట్టినట్టున్నాను. ఇలా అయిపోయింది. “

 సంజాయిషి కాకుండా

“తన తప్పు ఏమీ లేదు ” అనే భావం

 సరోజ గొంతులో…

 కమలమ్మలో కోపం తారస్థాయి నంటింది.”ఇదిగో మళ్లీ  నా కోసమే అంటూ నెపం నా మీద నెట్టకు.

 అయినా ఆఖరి నిమిషం వరకు ఆగటం ఎందుకు నువ్వు వంట ఇంట్లో ఉన్నప్పుడే ఓ పక్క కాచేయొచ్చు కదా!    పాలు నష్టపోవటం ఒకటి.

 అవి చిక్కటి పాలు ఇంటికి తెచ్చి పోస్తున్నందుకు వంద రూపాయలు తీసుకుంటున్నాడు లీటర్కి

 డబ్బు దండగ!  పాలు లక్ష్మీ స్వరూపం. ఏమి ఆ మంగళం అవుతుందో అని గుండె దడగా ఉంది..ఇంతటి తప్పు చేసి పైగా సమర్ధించుకుంటున్నావా..

 గుక్క తిప్పుకోకుండా దులిపేసిందావిడ.

” అత్తయ్య ప్లీజ్.. ఇంకొక్క మాట కూడా మాట్లాడకండి.

 నేనేం చిన్న పిల్లని కాదు మీరు అలా దండించడానికి.”

 పొద్దున లేచిన దగ్గర్నుంచి వరుసగా పని చేస్తూనే ఉన్నాను..పొరపాటు మానవ సహజం.

నాకు ఆఫీసుకు టైం అయిపోతుంది. వెళుతున్నాను.

 రూమ్ లోకి వచ్చి స్కూటీ తాళం చెవులు తీసుకుంటుంటే ” నేను డ్రాప్ చేస్తానులే ఈ కోపంలో స్కూటీ వద్దు… అన్న భర్త భాస్కర్ మాటలకి అడ్డు చెప్పలేదు సరోజ.

 “ప్లీజ్ సరోజ అమ్మని అపార్థం చేసుకోవద్దు. ఆవిడ పాతకాలం మనిషి. సెంటిమెంట్స్ ఎక్కువ ” అంటూ ఏదో మాట్లాడబోయాడు కార్లో భాస్కర్

 సీట్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటూ “ఏమండీ ప్లీజ్ ఏం మాట్లాడకండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఫైల్ ని ఫైనలైజ్ చేయాలి. ఎం.డి వస్తారు ఆఫీస్ కి..

 నా మనసు చాలా గాయపడింది.

 రేపు చూసుకుందాం ఈ విషయం ” అంది.

******.        ********     ******

 “ప్రసాద్ ని నిన్న ఇచ్చిన ఫైల్ తీసుకుని రమ్మను “

 కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతున్న అటెండర్ తో అంది.

 “ఆరు ఇంకా రాలేదమ్మా” అన్నాడు అటెండర్..

 ఇంకా రాకపోవటం ఏమిటి ఎండి గారు వచ్చే టైం అయింది.

 నిన్ననే అంతా ఫైనలైజ్ చేసి ఒకసారి సరి చూడమని అడిషనల్ మేనేజర్ ప్రసాద్ కి ఇచ్చింది.

ఇంతలో మేనేజర్ వచ్చి ” మేడం ప్రసాద్ వాళ్ళ అమ్మగారికి రాత్రి చాలా సీరియస్ అయ్యిందట.

 రాత్రికి రాత్రి హడావిడిగా వెళ్ళిపోయాడు “

ఫైల్ సంగతి అడిగితే వాళ్ల ఇంట్లో ఉందని తాళం చెవులు పక్కింట్లో ఇచ్చానని చెప్పాడు. “

 మేనేజరు చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు

 ఇంతలోనే ఎండి గారు రమ్మంటున్నారని కబురు.

 సరోజ నెమ్మదిగా ఎండి గారి రూమ్ లోకి అడుగుపెట్టింది.

” వెల్ సరోజి గారు ఈరోజు మూడు గంటలకి నాకు మీటింగ్ ఉంది. మీరు ఆ ఫైల్ ఒకసారి ఇస్తే చూసి నేను వెంటనే వెళ్లిపోవాలి. “

“సర్…. మూడు గంటలకి కదా మీటింగు నేను 1.30 కల్లా ఆ ఫైల్ వచ్చే ఏర్పాటు చూస్తాను”&: సంకోచిస్తూనే  జరిగింది చెప్పింది.

” వాట్ “ఎండి గారి స్వరానికి ఆఫీస్ అంతా ఉలిక్కి పడ్డది.

 సరోజ సరేసరి…” సర్ ప్లీజ్ చెప్పేది వినండి అనబోతు ఉంటే

“”” నో నో మిస్సెస్ సరోజ ఇంత బాధ్యతలేనితనాన్ని  నేను సహించను. అయినా ఆఖరి నిమిషం వరకు పేర పెట్టుకోవడం ఎందుకు.

 ఈ డీల్ చాలా వాల్యుబుల్

 ఇవాళే పూర్తి చేసుకుంటే శుభమని చెప్పాడు మా పురోహితుడు.

 మీ వల్ల ఆ పని అవటం లేదు పైగా సమర్ధించుకోకండి” అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.

 పాలిపోయిన మొహంతో నెమ్మదిగా వచ్చి సీట్లో కూలబడింది.

 మనసు భగభగ మంటుంది.

 ఎమ్. డి.గారు ఈ పని అప్ప చెప్పింది రెండు రోజుల క్రితమే.

 అయినా అంతా సరైన సమయంలోనే పూర్తి చేసింది.

 ఆయన తిట్టిన తిట్లకి రిజైన్ చేద్దామని పించింది.

 వైట్ పేపర్ తీసుకుంది కూడా….కానీ 

 తన జీతం…

హోదా…

 ఆ హోదా వల్ల చుట్టాల లో తనకి వస్తున్న గౌరవం

 తమ సాంఘిక స్థితిని పెంచుకున్న వైనం.

 అన్ని జ్ఞాపకం వచ్చాయి.

 “ఏదో పెద్దవాడు కోపంలో అన్నాడు అనుకుంటే పోలే!

 నిజంగానే పాపం నష్టం కలిగింది కాబట్టి బ్యాలెన్స్ కోల్పోయాడు.

 అనుకుంటూ ఉంటే చెళ్ళన  ఏదో చరిచి నట్టు అయింది మనసులో సరోజకి.

 పొద్దున్న అత్తగారి స్థితి అంతే కదా! నిజం చెప్పాలంటే పాలు మాడిపోతే పుట్టింట్లో అమ్మ కూడా చాలా బాధపడేది. పార్వతి దేవికి అభిషేకం చేయించి ఉపవాసాలు ఉండి నానాకంగారు పడిపోయేది.

 మరి అత్తగారు…  ఆ తరువాత ఆ తరం ఆవిడే కదా! ఇంటికి వెళ్ళగానే ఆవిడని క్షమాపణ అడగాలి.

 ఆలోచిస్తూ ఉండంగానే ఆఫీస్  ఫోన్ మోగింది.

” అమ్మాయి నీ సెల్ ఫోన్  చేస్తే తీయవేమే…” సైలెంట్ మోడ్ లో ఉంది అత్తయ్య” 

  సర్లే సర్లే పొద్దున్న కారులో ఏదో అన్నావట. భాస్కరం తెగ బాధ పడిపోతున్నాడు.

   చూడమ్మాయ్ పెద్దదాన్ని ఎదో అంటుంటాను. మర్చిపోమా… సాయంత్రం 

మామూలుగా వచ్చేయ్ ఇంటికి ” అనునయంగా అంటున్నఅత్తగారి గొంతు వింటే    బాధతో పశ్చాత్తాపంతో కన్నీళ్లు ఆగలేదు సరోజకి.

******«.      *******.        ******-