*(సై) కాలేజీ అమ్మాయి* ( గల్పికల పోటీకి )

కాలేజీ ముందు బస్ స్టాప్ లో నుంచున్న మానస మనసు గాల్లో తేలిపోతోంది.

.  ఎమ్. యే. సైకాలజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అద్భుతంగా రాసింది. డిస్టింక్షన్ గ్యారెంటీ..

 తర్వాత పరిశోధన కూడా చేసి..

సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చెయ్యాలనేది తన ఆశయం.

.  మనసే అన్నింటికీ కారణం అంటారు కదా.

 ఆ మనసుకి చికిత్స చేసే అవకాశం తనదవుతుంది.

.     “అమ్మా…”అన్న దీనమైన గొంతు విని తలెత్తింది.

.  

.     రోజు బస్టాండ్ లో అడుక్కునే బిచ్చగత్తె.

తను కాలేజీలో   చేరినప్పటి నుంచి ఆమె  అక్కడ అడుక్కోవడం చూస్తూనే ఉంది. కాలేజీలో పిల్లలందరికీ ఆ అవ్వ పరిచితమే.

.   .

.  చాలా ఆనందంలో ఉందేమో డబ్బులు వేద్దామని బ్యాగు మీద చెయ్యి పెట్టింది.

 సడన్గా జ్ఞాపకం వచ్చింది తన దగ్గర  పది రూపాయలు నోటే ఉందని. చిల్లర లేదని.

 మానస డైలమా  లో పడింది.

పోనీ పది రూపాయలు వేసేద్దామా …

 ఎంత ఆనందంగా ఉన్నా మరీ అంత పనికిరాదు.

. పోనీ  పది రూపాయల నోటు వేసి ఆ బొచ్చలో  ఉన్న  చిల్లర తీసుకుంటే…

. సాధారణంగా తమ కాలేజీ స్టూడెంట్లు   అలా చేస్తూనే ఉంటారు.

 ఓరగా  బొచ్చ వేపు చూసింది.

ఒక్క ఐదు రూపాయల నోటు

 అది ఎగిరిపోకుండా దానిమీద బాగా అరిగిపోయిన రూపాయి బిళ్ళ. ( ఆ బిళ్ళ సత్తుదేమో చెల్లదు.)

. అంటే ఒకవేళ చిల్లర తీసుకున్నా ఐదు రూపాయలు ఇచ్చేయాలి

అబ్బో అదీ ఎక్కువే!!

. ముష్టి వెయ్యకూడదని నిర్ణయించేసుకుంది.

కానీ….

.  బ్యాగు మీద చేయి వేసి దానం చేయకపోతే ముసలిది తన గురించి ఏమనుకుంటుందో…

.      ఎహె…దానికి అన్ని తెలివితేటలు కూడానా…

తనంటే సైకాలజీ చదివింది కాబట్టి. మనుషుల్ని వాళ్ళ ఆలోచనలని అంచనా వేయగలదు.

అయినా….  ఆ బిచ్చగత్తె  ఏమనుకుంటుందో అనే ఆలోచన.. నాకెందుకు..

 ఇష్టం ఉంటే అవకాశం ఉంటే వేస్తాం.లేకపోతే పక్కకి వెళ్లి పోవాల్సిందే..

 అనుకుంటూ.. రెండు అడుగులు వెనక్కి వేసి చూపు తిప్పు కుంది.

.   బిచ్చగత్తె సాలోచనగా మానస వేపు చూసి వెళ్ళిపోయింది.

**  

    తను వెళ్లాల్సిన బస్సు చూస్తూచూస్తూ ఉండగానే వెళ్ళిపోయింది.

మళ్లీ  ముప్పావు గంట  వేచి చూడాల్సిందే..

.

సరేలే…

.         ‘పరిసరాలను గమనిస్తూ…. మనుషులను

 బాహ్య రూపాన్ని, నించున్న తీరుని చూసి అంతరంగాన్ని అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే టైం ఇట్టే  గడిచిపోతుంది.’అనుకుంది.

( ఈ విషయంలో తనని  ప్రొఫెసర్ గారు ఎప్పుడూ మెచ్చుకుంటారు సరిగ్గా అంచనా వేస్తుందని )

ఇంతలో మళ్లీ “అమ్మా “అని వినిపించింది

తలెత్తింది. ఆ బిచ్చగత్తే !

మళ్లీ ఎందుకు వచ్చిందీ.. చిన్న విసుగు..

 ఆ… ఇందాకల తను వెయ్యబోయి ఆగింది కదా అందుకే ఏమో.

 ముష్టి బుద్ధి.

 బొచ్చవైపు మళ్లీ ఓరగా చూసింది.

 ఇంకొంచెం చిల్లర పోగయింది.  బొచ్చ నిండుగా ఉంది.

 అయినా…

 ఆ బిచ్చగత్తెని “చిల్లర ఇవ్వు అని “అడగాలా?

 ‘తనే తీసుకుంటే బావుంటుందా?’

అయినా ముష్టి దానితో తనకేమిటి..

 పది రూపాయలు పడేస్తే సరిపోతుంది.

ఆలోచిస్తూనే బ్యాగ్ లోని పది రూపాయలు

 తీసి బొచ్చలో వేసేసింది.

 ముష్టిది బొచ్చెలో నుంచి ఐదు రూపాయలు,రెండు రెండు రూపాయల నోట్లు తీసి మానస చేతిలో నిర్లిప్తంగా  పెట్టేసి…ముందుకి కదిలింది.

***.          ***.     *****