*ముందు తెలిసేనా…..*( గల్పికల పోటీకి )

” అమ్మో అమ్మా సుజాత అక్క ఏం చేసిందో చూడు “

 ఆశ్చర్యము ఏడుపు కలగలసిన కొడుకు కేకలకి కుక్కర్ని ఆ మట్ట్టుని వదిలేసి గబగబా వంటింట్లోంచి బయటకు వచ్చింది కాంతమ్మ .

 ముక్కు మీద చెయ్యి పెట్టుకుని ఏడుపు నవ్వు కలగలిసిన కళ్ళతో తల్లి వైపు చూసింది సుజాత.

” ఏమైందే నా తల్లి ఏమైంది” కొద్దిగా జీర గొంతుతో

 సుజాత చెయ్యి తీసి చూసింది కాంతమ్మ.

 ముక్కంతా  ఎర్రగా కందిపోయి ఉంది. ముక్కికి రాగి కాడ చుట్టు..

 “అదేమిటి ఎవరు కుట్టారు”  అంది ఆశ్చర్యంగా .

” మరేమో అమ్మ పక్కింటి ఆంటీ కంసాలాయన దగ్గరికి తోడు రమ్మంది. అక్కడ నాకన్నా చిన్న అమ్మాయి రాగి కాడ కుట్టించుకుంది.

 “నాకు ముక్కుపుడక అంటే ఇష్టం కదా! అందుకని నేను కూడా కుట్టించేసుకున్నాను.” కొంచెం నంగి గా తల్లి తిడుతుందేమో అని భయపడుతూ చెప్పింది పదేళ్ల  సుజాత.

 కూతుర్ని దగ్గరికి తీసుకుని నవ్వింది కాంతమ్మ.

 రాగి తీగ కొంచెం లావుగా మో టుగా ఉండటం వల్లా,నిద్రలో నొక్కుకోవడం   వల్లా కురుపు అయింది.

 అసలే చలికాలమేమో వారం రోజులు పట్టింది ఆ నొప్పి తగ్గటానికి.

 నొప్పి పూర్తిగా తగ్గిపోయి రాగి కాడ తీసి ముక్కుపుడక పెట్టుకున్న రోజు  సుజాత సంబరం అంతా ఇంతా కాదు!!

 కోటేరు వేసినట్టున్న ముక్కుకి ముక్కుపుడక అదనపు అలంకరణ అయింది.

” ఎండలో ఉన్నప్పుడు,.   ఫంక్షన్స్ లో లైట్ ల వెలుగులోనూ నీ ముక్కుపుడక భలే చమక్కు మంటుంది” అని స్నేహితురాళ్ళు, తెలిసిన వాళ్ళు అంటుంటే మురిసిపోయేది.

*****.       ******.      ******

” ఆలోచించుకోమ్మా! అన్ని రకాలుగా మంచి సంబంధం.

 ఆ కుర్రాడికి ఎందుకో ముక్కుపుడక ఉంటే నచ్చలేదుట.

 అది కూడా వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పారు.తీసేయమన్నాడట 

 కాంతమ్మ మాట పూర్తి కాకుండానే “అమ్మా “అంటూ రోషంగా ఎర్రబడ్డ కళ్ళతో చూసింది సుజాత.

.    నీకు తెలుసు కదా నాకు ముక్కుపుడక అంటే ఎంత ఇష్టమో!  పోనీ అది వదిలేయ్ కానీ చెప్పే పద్ధతి ఇదేనా!

.      సర్లే…సర్లే…. ఊరుకో అని ఊరడించింది కాంతమ్మ.

***.    **** ******

 ఆ తర్వాత చాలానే పెళ్లి చూపులు జరిగేయి.

” ఈ కాలంలో ముక్కుపుడక ఎవరు పెట్టుకుంటున్నారండి “

 “ఒకప్పుడు ఫ్యాషనే గాని ఇప్పుడు ఎవరూ పెట్టుకోవడం లేదు”

 లాంటి కారణాలతో వెనక్కి వెళ్ళిపోయినవే ఎక్కువ.  

 సుజాత పెళ్లికి పెద్ద సమస్య అయిపోయింది కాంతమ్మ దంపతులకు.

 తల్లితండ్రుల బాధ చూడలేక సుజాత ముక్కుపుడక తీసేసింది.

 అక్కడ గుంటలాంటి మచ్చ కనిపించకుండా ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించేసుకుంది..

 ఆరోజు సుజాతకి పెళ్లిచూపులు…

 అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.

 అన్ని అందుబాటులోనే ఉన్నాయి. సుజాత ఫోటో చూసి నచ్చుకున్నాడు కూడా!!

 పేరుకే పెళ్లిచూపులని

 నిశ్చితార్థం చేసేసుకోవచ్చని ఇరువైపులా అనుకున్నారు .

 అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి చెల్లెలు అందరూ వచ్చారు.

 “అన్ని చాలా బాగున్నాయి మిస్ సుజాతా…కానీ మీ కోటేరు ముక్కుకి ఒక ముక్కుపుడక ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో.  పరవాలేదు లెండి ఇంకా టైం ఉంది కదా కుట్టించేసుకోవచ్చు”   అతని మాటలు పూర్తికాకముందే…..

 పళ్ళ బిగువున కోపాన్ని ఏడుపుని ఆపుకుంటూ కళ్ళు తేలేసి.. పడిపోబోతున్న తల్లిని పట్టుకుంది సుజాత.

*****.     

    ****.     ***** ****–